2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ వీఆర్ఓ

2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ వీఆర్ఓ

అనంతపురం: ఓ రైతుకు పట్టాదారు పాస్ బుక్ ఇచ్చేందుకు రెండు లక్షలు లంచం డిమాండ్ చేసిన వీఆర్ఓ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. జిల్లాలోని ముదిగుబ్బ తాసిల్దార్ కార్యాలయంలో జరిగిందీ ఘటన. రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన రైతు గోపాల్ నాయక్ పట్టాదారు పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్ని రోజులు తిరిగినా పాస్ బుక్ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో బాధితుడు గోపాల్ నాయక్ కు నాకు పాస్ బుక్ ఇవ్వడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారని గట్టిగా నిలదీశాడు. డబ్బులు ఇవ్వనిదే పని జరగదని చెప్పడంతో ఎంత ఇవ్వాలని అడిగాడు. వీఆర్ఓ చంద్రశేఖర్ రెండు లక్షలు డిమాండ్ చేయగా.. బాధితుడు నేరుగా వెళ్లి తనకు సహాయం చేయమంటూ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వీఆర్ఓ చంద్ర శేఖర్ కు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులే 2 లక్షలు లంచం డబ్బు ఇచ్చి పంపారు. సదరు నగదును గోపాల్ నాయక్ ముదిగుబ్బ తాహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓ చంద్రశేఖర్ కు ఇవ్వగా ఏసీబీ అధికారులు వచ్చి వెంటనే పట్టుకున్నారు. నగదును వీఆర్ఓ చంద్రశేఖర్ స్వహస్తాలతో లెక్కించి పెట్టుకున్నట్లు కెమికల్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. తన తాహశీల్దార్, ఉన్నతాధికారులు డిమాండ్ చేయడంతోనే తీసుకున్నట్లు వీఆర్ఓ చంద్రశేఖర్ చెప్పడంతో ఏసీబీ అధికారులు తాహశీల్దార్ అన్వర్ హుస్సేన్ ను విచారించారు.